Thursday, September 28, 2006

23 ఏళ్ల కల సాక్షాత్కారం... (ఈనాడు వార్త)

శ్రీమదాంధ్ర మహాభారతం ఆవిష్కారం
న్యూస్‌టుడే, తిరుమల

దాదాపు 23ఏళ్ల కల ఫలించి గ్రంథస్తరూపంలో సాక్షాత్కరించింది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా టీకా, తాత్పర్యాలు సహా మహాభారతాన్ని ముంద్రించాలన్న తితిదే లక్ష్యం నెరవేరింది. తితిదే ముద్రించిన శ్రీమదాంధ్రమహాభారతం గ్రంథాన్ని జాతికి అంకితం చేశారు. 18 పర్వాలతో కూడిన 15సంపుటిల మహాభారతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అదీ కేవలం రూ.వెయ్యి ధరకే.

1983 నుంచి ఈ క్రతువు అనేక అవాంతరాలు అధిగమించి 2006లో పూర్తయింది. పోతన జయంతోత్సవాలను 1983లో వరంగల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తితిదే ఓ సావనీర్‌ వెలువరించింది. ఆ సందర్భంలోనే శ్రీమదాంధ్ర మహాభారతం గ్రంథాన్ని టీకా, తాత్పర్యాలు సహా వెలువరిస్తే ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ బాధ్యతను తితిదే నిర్వర్తించాలని కూడా కోరారు. అందుకు తితిదే సముఖంగా స్పందించడంతో 1983లో ఈ క్రతువు ప్రారంభమైంది. ప్రముఖ పండితుడు దివాకర్ల వెంకటావధాని ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఆయన మరణానంతరం మహాభారత గ్రంథస్తానికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. మొదట ఆదిపర్వాన్ని మాత్రమే ముద్రించాలని నిర్ణయించారు. తర్వాత 18పర్వాలూ ముద్రించాలని నాగసిద్ధారెడ్డి హయాంలో నిర్ణయించారు. వివిధ కారణాలతో అడుగడుగునా ఆటంకాలు రావడంతో ఈ ప్రాజెక్టు చాలా జాప్యమైంది. ఎట్టకేలకు 2006లో పూర్తయింది. ఈ క్రతువులో 32మంది ప్రముఖ పండితులు పాలుపంచుకున్నారు. వారి శ్రమ ఫలించి 18 పర్వాల మహాభారతం 15సంపుటిల్లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 70వేల పేజీలున్న ఈ గ్రంథాన్ని తితిదే కేవలం రూ.వెయ్యికే విక్రయిస్తుండటం అభినందనీయమే. రాజనీతే కాకుండా కుటుంబ బాంధవ్యాలు, మానవ సంబంధాల గురించి విపులంగా చర్చించిన మహాభారత గ్రంథం ప్రతీ ఇంటిలో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

సీడీ రూపంలో కూడా...
మరింతగా జనవాళిలోకి తీసుకెళ్లాలంటే మహాభారతాన్ని సీడీ రూపంలోకి తీసుకురావాలని శ్వేత భావిస్తోంది. ఆ విధంగా చేస్తే ఉషశ్రీ రామాయణంలా మహాభారతాన్నీ మరింత జనరంజకంగా తీర్చిదిద్దగలమని తితిదే తలస్తోంది. ఇందుకోసం శ్వేత డైరెక్టర్‌ భూమన్‌ తితిదేకు ప్రతిపాదనలు సమర్పించారు. అనుమతి లభిస్తే మహాభారతాన్ని సీడీలుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం మొదలవుతుంది.

Thursday, September 07, 2006

నా జీవిత యాత్ర

"వయస్సు ఎంతో లేకపోయినా, స్కూలులో వున్న అల్లరి పిల్లలలో మనపేరు మొదటిదిగా వుండేది."

"నాకు అతని స్నేహంవల్ల అలవాటయినవి బడి పిల్లలిని ఏడిపించడం, వాళ్ల పుస్తకాలు పారవెయ్యడం, ఉపాధ్యాయుల్ని వుడికించడం మొదలైన ఘనకార్యాలు!"


ఈ మాటలు ఎవరు రాశారనుకుంటున్నారు? ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు!

ఆయన 1942 లో క్విట్టిండియా ఉద్యమంలో కారాగారవాసం చేస్తూ రాసుకున్న "నా జీవిత యాత్ర" పుస్తకానికి 1972 లో అప్పటి భారత రాష్ట్రపతి వి.వి.గిరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు ముందుమాటలు రాశారు.

ఈ స్వీయచరిత్ర archive.org లో దొరుకుతోంది. తప్పకుండా చదవండి!

ఇక్కడ download చేసుకోవచ్చు:
http://www.archive.org/details/NaaJeevitaYatraTanguturiPrakasham